ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది కోళ్లను మింగేస్తున్న ‘బర్డ్ ఫ్లూ'(Bird Flu) వ్యాధి.. మనుషులకూ సోకుతోంది. ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తికి ‘బర్డ్ ఫ్లూ’ పాజిటివ్ వచ్చింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని కోళ్ల ఫామ్ కు సమీపంలో ఉంటున్న వ్యక్తిలో ఫ్లూ లక్షణాలు(Symptoms) కనిపించాయి. అతడికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ తేలింది. వెంటనే అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మనుషులకు వ్యాపించిన తొలి ‘బర్డ్ ఫ్లూ’ కేసు ఇది. ఈ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదంటున్నారు అధికారులు. బాదంపూడిలో కిలోమీటర్ మేర రెడ్ జోన్ చేశారు. ఇన్ఫెక్టెడ్ జోన్ ఫాంల్లోని కోళ్లను చంపి ఖననం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 24×7 కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది.