PHOTO: THE TIMES OF INDIA
చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3…అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. తొలిసారి జాబిల్లికి సంబంధించిన ఫొటోను షేర్ చేసినట్లు ఇస్రో(ISRO) ప్రకటించింది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన 27 గంటల తర్వాత తొలి ఫొటోను అక్కణ్నుంచి పంపించింది. ‘భూమి గురుత్వాకర్షణ శక్తి దాటుకుని చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన లూనార్ తొలి మెసేజ్ ను పంపించింది.. 3,84,400 కిలోమీటర్ల దూరం నుంచి ఫస్ట్ ఇమేజ్ ని షేర్ చేసింది’ అంటూ శాస్త్రవేత్తలు సంతోషంతో ప్రకటించారు.
ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 నిన్న రాత్రికి చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. జులై 14న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఆగస్టు 23న సాయంత్రం ఈ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం మొత్తం రూ.613 కోట్లను ఇస్రో వెచ్చించింది.