ఇప్పటికే బాలికను మృత్యువు పాలు చేసిన చిరుత బోనులో చిక్కగా.. తిరుమలలో మొత్తం 5 చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇవన్నీ అదే ప్రదేశంలో తిరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. చిన్నారి లక్షితను ఎత్తుకెళ్లిన ప్రదేశంలోనే మరో రెండు చిరుతలు తిరుగుతున్నట్లు కంటపడింది. దీంతో వాటిని బంధించేందుకు ఫారెస్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమల నడక దారిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరే మరోసారి చిరుత కనపడింది. ఈ చిరుతను కొంతమంది పిల్లలు గమనించి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయాన్ని వారు ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు.
ఈ నెల 12 రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న కొద్దిసేపటికే అక్కడ లక్షిత అనే ఆరేళ్ల పాపను చిరుతపులి ఎత్తుకెళ్లింది. చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లి ప్రాణాలు తీసింది. ఈ జంతువు కోసం బోన్లు ఏర్పాటు చేయగా నిన్న అర్థరాత్రి పట్టుబడింది. హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకునేలోపే ఈరోజు మరోసారి చిరుత కనిపించింది. మొత్తంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోనే చిరుతలు తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అసలే భారీ భద్రత నడుమ మెట్లు ఎక్కుతున్న సమయంలో చిరుత కనపడటంతో భక్తులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది.