చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ పరిభ్రమణం అత్యంత క్లిష్టతర దశకు చేరుకుంటోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ప్రకటించింది. ప్రస్తుతం జాబిల్లికి 170 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ ను 100 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి చేర్చే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నెల 9 నుంచి 17వ తేదీ మధ్యన చంద్రయాన్-3ని 100 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి మళ్లించనున్నట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతానికి అత్యుత్తమ కండిషన్ లో ఉందని.. చంద్రునికి 170 కిలోమీటర్ల దూరంలో 4,313 కిలోమీటర్ల దీర్ఘచతురస్రాకార వృత్తంలో తిరుగుతున్నదని సోమనాథ్ తెలిపారు. ఇప్పటికైతే 100 కిలోమీటర్ల పరిధి వరకు తమకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదన్నారు.
ఈసారి చాలా కచ్చితత్వంతో ల్యాండర్ ను జాబిల్లిపై దించబోతున్నామని, ప్రణాళికాబద్ధం(Planned)గా కక్ష్యకు సంబంధించిన మార్పులు జరుగుతున్నాయని ISRO ఛైర్మన్ వివరించారు. ఈ విషయంలో చంద్రయాన్-2 నుంచి కొన్ని అనుభవాలు నేర్చుకున్నామని, ఈసారి కచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్ ఉంటుందన్న ధీమాను కనబరిచారు. చంద్రుని కక్ష్యలోకి శనివారం ప్రవేశపెట్టిన తర్వాత ఆదివారం రాత్రికి ల్యాండర్ నుంచి తొలి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.