భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)… తన విజయాల సిగలో మరో ప్రయోగాన్ని వేసుకుంది. ఇన్ శాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్య(Orbit)లోకి ప్రవేశపెట్టింది. వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అంచనా వేయడం ఈ ఉపగ్రహ లక్ష్యంగా నిర్దేశించారు. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు.
2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని GSLV వాహక నౌక ద్వారా నిర్ణీత కక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెడుతున్నారు. భూమి, సముద్ర ఉపరితలాలను అబ్జర్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వాతావరణ అంచనా, విపత్తుల గురించి ముందస్తుగానే హెచ్చరికలు(Warnings) ఇచ్చే వ్యవస్థను ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహం మెరుగు పరుస్తుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2:05 గంటలకు ప్రారంభం కాగా.. శనివారం సాయంత్రం దీన్ని నింగిలోకి పంపించారు.