తిరుమల(Tirumala)లో మరో చిరుతపులి పట్టుబడింది. అలిపిరి కాలినడక మార్గంలో ఏడో నంబర్ మైలు వద్ద బోనుకు చిక్కింది. ఇప్పటికే పలు మార్గాల్లో బోన్లు ఏర్పాటు చేయగా ఇప్పుడు మరొకటి పట్టుబడ్డట్లయింది. ఇదివరకే రెండు చిరుతలు చిక్కిన విషయం తెలిసిందే. ఆరేళ్ల బాలికపై దాడి చేసిన తర్వాత తితిదేతోపాటు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాలినడక మార్గంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వన్య మృగాలు సంచరిస్తుండటం ఆందోళనకు కారణమైంది. దీంతో ఆ ప్రాంతంలో ఫారెస్టు సిబ్బంది బోన్లు ఏర్పాటు చేశారు. బాలికపై దాడి చేసిన తర్వాత వెంటనే వీటిని ఏర్పాటు చేయడంతో… రెండు చిరుతలు పట్టుబడ్డాయి. ఈ రెండింటితోపాటు మరో మూడు మొత్తంగా ఐదు చిరుతలు అక్కడ సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, పూర్తి స్థాయిలో నిఘా పెట్టేందుకు గాను మొత్తం 500 కెమెరాలు ఏర్పాటు చేశారు. వన్యమృగాల కదలికలను ఎప్పటికప్పడు గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో చిరుత పట్టుబడటంతో దాన్ని SV జూపార్క్ కు తరలిస్తున్నారు.