ఆంధ్రప్రదేశ్ కు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు(New Judges) రాబోతున్నారు. ఇందులో ఒకరు బదిలీపై వస్తుండగా, మరో నలుగురు నూతనంగా నియమితులవుతున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 10న పంపిన ఫైల్ కు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా 10 హైకోర్టులకు చెందిన 16 మందిని ట్రాన్స్ ఫర్ చేయగా.. తొమ్మిది హైకోర్టులకు 17 మంది కొత్త జడ్జిలను నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం(High Court) నుంచి ఇద్దరు న్యాయమూర్తులు బదిలీపై వెళ్తుండగా.. కర్ణాటక నుంచి ఒకరు ఏపీకి వస్తున్నారు. మరోవైపు అదనంగా ఏపీకి నలుగురు కొత్తవారిని నియమిస్తున్నారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయవాదుల కోటా నుంచి హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ నియమితులయ్యారు.
37 మందికి గాను 30కి చేరిన సంఖ్య
నలుగురు అదనపు న్యాయమూర్తులతోపాటు ఒకరు కర్ణాటక నుంచి వస్తుండటంతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 30కి చేరుకుంది. 37 మంది ఉండాల్సిన కోర్టులో ప్రస్తుత రిక్రూట్మెంట్లతో ఆ సంఖ్య 30కి చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న జస్టిస్ సి.మానవేంద్రరాయ్ గుజరాత్ కు, జస్టిస్ దుప్పల వెంకటరమణ మధ్యప్రదేశ్ కు బదిలీ అయ్యారు. కర్ణాటక నుంచి జస్టిస్ జి.నరేందర్ ఏపీకి వస్తున్నారు.