ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రతిపాదించగా, ఇక నుంచి ఫస్టియర్(First Year) సంవత్సరాంత(Final) పరీక్షలు తొలగించనుంది. ఇంటర్నల్ తరహాలో కాలేజీలే ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఇక యథావిధిగా సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి NCERT పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడుతుండగా.. ఇపుడున్న సిలబస్, పాఠ్య పుస్తకాల్ని పూర్తిగా మార్చడంతోపాటు కొత్త సబ్జెక్టులు, మార్కుల విధానంలోనూ మార్పులు తీసుకువస్తున్నారు. ఇంటర్నల్ మార్కుల విధానంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.
థియరీ, ఇంటర్నల్ మార్కులుగా…
ఫస్ట్ లాంగ్వేజీని తప్పనిసరి చేస్తూ సెకండ్ లాంగ్వేజీని ఆప్షన్ కింద ఇచ్చింది. MPCలో మాథ్య్ 1A, 1Bని సింగిల్ సబ్జెక్ట్ గా… బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయోలాజీగా పరిగణిస్తారు. ఇక ప్రతి కోర్సులోనూ 5 సబ్జెక్టులే ఉంటాయి. MPCలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, మిగతాది ఎలెక్టివ్ లాంగ్వేజ్… బైపీసీలో బయోలాజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, మిగతాది ఎలెక్టివ్ లాంగ్వేజ్ ఉండనున్నాయి. వీటితోపాటు ఆరో సబ్జెక్టును అడిషనల్ సబ్జెక్టుగా తెస్తూ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ సబ్జెక్టును తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఐదు సబ్జెక్టుల్లో ఏదేని ఒక దాంట్లో ఫెయిలైన సందర్భంలో ఆరో సబ్జెక్టు మార్కుల్ని వాటికి కలుపుతారు. ఫస్టియర్లో 500, సెకండియర్లో 500 మార్కులుంటాయి. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కాగా, అందులో 80 మార్కులు థియరీ, మరో 20 ఇంటర్నల్ మార్కుల్ని ప్రాజెక్ట్ వర్క్ కింద కేటాయిస్తుండగా ఇది కోర్సును బట్టి మారుతుంటుంది. MPCలో 500కు గాను 380 థియరీ కింద, 120 మార్కుల్ని ఇంటర్నల్ కింద లెక్కిస్తారు. బైపీసీలో 370 థియరీకి, 130 ఇంటర్నల్స్ ప్రాక్టికల్ కి ఇస్తారు.