మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 09 Jan 2024
తిరుమల శ్రీవారి ఆలయ వెబ్ సైట్ కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆర్జిత సేవలు, ఇతర టికెట్లను ఆన్ లైన్(Online)లో ఉంచిన నిమిషాల్లోనే మొత్తం అమ్ముడవుతుంటాయి. అంతలా TTD వెబ్ సైట్ కు భక్తుల తాకిడి ఉంటుంది. అలాంటి ఆన్ లైన్ సేవల్ని మరింత విస్తరించేలా పాత వెబ్ సైట్ స్థానంలో కొత్త సైట్ ను తీసుకువచ్చింది. ఇలా తిరుమల శ్రీవారి భక్తులను అలర్ట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తన వెబ్ సైట్ పేరును మార్చినట్లు ప్రకటించింది. తిరుపతి సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న TTD అనుబంధ ఆలయాలు సహా హిందూ ధర్మానికి పెద్దయెత్తున ప్రచారం కల్పించే దిశగా కొత్త వెబ్ సైట్ తయారు చేసినట్లు తెలిపింది. గతంలో tirupatibalaji.ap.gov.in గా ఉన్న వెబ్ సైట్ ను కొత్తగా ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్ లో భాగంగా అధికారిక వెబ్ సైట్ మారిందని, ఈ విషయాన్ని భక్తులందరూ గమనించాలని TTD కోరింది.
అన్ని సేవలు ఒకే చోట…
స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకేచోట లభించాలన్న ఉద్దేశంతో వెబ్ సైట్ పేరును మారుస్తూ TTD బోర్డు నిర్ణయించింది. ఒకే సంస్థ, ఒకే సైట్, ఒకే యాప్ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పును చేపట్టామని… ఇక నుంచి వివరాలు, ఆన్ లైన్ బుకింగ్ లను కొత్త వెబ్ సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
గతంలో TTD వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ పేరుతో ఉండగా.. తర్వాత కాలంలో సదరు సైట్ ను సర్కారుకు అనుసంధానిస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్పు చేసింది. తాజాగా ఆ పేరును కూడా మార్చి కొత్త సైట్ కు రూపకల్పన చేశారు.
అనుబంధ ఆలయాలన్నీ…
శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణా, బస వివరాలన్నీ ఈ కొత్త సైట్ లోనే ఉంటాయి. శ్రీవారి ఆలయ విశిష్టతలతో కూడిన చిత్రాలు, వీడియోలను భక్తులకు అనుగుణంగా అందుబాటులో ఉంచారు. నూతన వెబ్ సైట్ ను TTD ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ను జియో సంస్థ సహకారంతో TTD ఐటీ విభాగం తయారు చేయించింది.