తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ప్రక్షాళన ప్రారంభమైనట్లే కనపడుతుంది. నిన్న సమావేశమైన TTD బోర్డు.. కీలక నిర్ణయాలపై దృష్టి సారించింది. అందులో ప్రధానమైనది అన్య మతస్థుల్ని సాగనంపడం. చంద్రబాబు పగ్గాలు చేపట్టాక TTD ఛైర్మన్ గా బి.ఆర్.నాయుడు అక్టోబరు 31న నియమితులయ్యారు. తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలంటూ బాధ్యతలు చేపట్టకముందే ఆయన స్పష్టంగా చెప్పారు. అన్న మాట ప్రకారం బోర్డు భేటీలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తున్నది. అన్య మతస్థులకు వాలంటరీ రిటైర్మెంటా(VRS) లేదా రాష్ట్ర శాఖల్లో(Departments)కి బదిలీ చేయడమా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఎంతమంది అన్యమతస్థులు ఉన్నారన్న దానిపై ఛైర్మన్ గానీ, బోర్డు సభ్యులు కానీ క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో 7,000 మంది శాశ్వత ఉద్యోగులుండగా.. మరో 14,000 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ పర్మినెంట్ ఉద్యోగుల్లో 300 మంది వరకు హిందూయేతరులు ఉంటారని భావిస్తున్నారు. TTD-చట్టం ప్రకారం హిందువులే తిరుమలలో పనిచేయాలని కొన్నేళ్ల క్రితమే స్పష్టం చేశారు. పరిపాలన విభాగాల్లోని పోస్టులకు హిందువులే ఉండాలని 1989లోనే చట్టం చేశారు. కానీ వీటిని తోసిపుచ్చి అన్యమతస్థులు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చంద్రబాబు సర్కారు కొలువుదీరాక దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొత్త బోర్డు జరిపిన తొలి భేటీలోనే వీరిపై కీలక నిర్ణయం వెలువడింది.