ఇప్పటికే బాలికను మృత్యువు పాలు చేసిన చిరుత బోనులో చిక్కగా.. తిరుమలలో మరో రెండు చిరుత పులులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు అదే ప్రదేశంలో తిరగడంతో భక్తులు భయంతో కనిపిస్తున్నారు. చిన్నారి లక్షితను ఎత్తుకెళ్లిన ప్రదేశంలోనే ఇంకో చిరుత తిరుగుతున్నట్లు కంటపడింది. దీంతో దాన్ని బంధించేందుకు ఫారెస్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమల నడక దారిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరే మరోసారి చిరుత కనపడింది. ఈ నెల 12 రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న కొద్దిసేపటికే అక్కడ లక్షిత అనే ఆరేళ్ల పాపను చిరుతపులి ఎత్తుకెళ్లింది. చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లి ప్రాణాలు తీసింది. ఈ జంతువు కోసం బోన్లు ఏర్పాటు చేయగా నిన్న అర్థరాత్రి పట్టుబడింది. హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకునేలోపే ఈరోజు మరోసారి చిరుత కనిపించింది. మొత్తంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోనే మూడు చిరుతలు తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు.
అసలే భారీ భద్రత నడుమ మెట్లు ఎక్కుతున్న సమయంలో చిరుత కనపడటంతో భక్తులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. దాన్ని చూసినట్లు కొందరు భక్తులు చెబుతున్నారు.