అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని, దమ్ముంటే అడుగుపెట్టకుండా తనను ఆపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాలు విసిరారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా తనపై కక్షగట్టి మరీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడించారని గుర్తు చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ ప్రసంగించారు. మద్యపాన నిషేధమని ఎన్నికల్లో హామీ ఇచ్చినా దాన్ని విస్మరించి ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయం పొందుతోందని వైకాపా సర్కారును విమర్శించారు. “ఈరోజుల్లో 10 వేల కోట్లున్నా పార్టీ నడపడం సాధ్యం కాదు.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటేనే నడపగలం.. పార్టీని పదేళ్లు నడపడం సామాన్య విషయం కాదు.. పార్టీని నడిపేందుకే సినిమాలు చేస్తున్నా.. చివరకు నా సినిమాలు ఆడకుండా చేశారు.. సినిమా టికెట్ల మీద కూడా దిగజారిపోయే వ్యక్తి సీఎం’ అంటూ పవన్ అన్నారు.
ఎలా వస్తానో తెలియదు
విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదు.. కానీ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని పవన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైకాపా.. ఒక్క సీటూ లేని జనసేనను లక్ష్యంగా చేసుకుందంటేనే మనమంటే ఎంత భయం ఉందో అర్థమవుతుందన్నారు.