
సంపద కొద్దిమంది వద్దే ఉంటే చాలా ప్రమాదకరమని, అది అందరికీ చేరాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సరైన రాజకీయ నాయకత్వం లేకుంటే ప్రజల్లో ఎంత ప్రతిభ ఉన్నా వృథాయేనని భీమవరం బహిరంగ సభలో వివరించారు. డబ్బు, అధికారం ఉన్నవాడు పేదవాణ్ని దోచుకోవడమే క్లాస్ వార్ అని… కులం పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారని, వారు ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారని విమర్శించారు.
ఇసుక రీచ్ లను మూడు కంపెనీలకు కట్టబెట్టి మిషన్ల ద్వారా పనిచేయిస్తూ 50 వేల మంది కూలీలను ఆగమాగం చేశారని పవన్ విమర్శించారు. మద్యపాన నిషేధమని చెప్పి అదే మద్యంతో వేల కోట్లు సంపాదించి పథకాల పేరిట తిరిగి ఇస్తున్నారని గుర్తు చేశారు. ఆరోగ్యాల్ని ఛిద్రం చేసి మరీ జీవితాలను ఛిన్నాభి న్నం చేస్తున్నారని జగన్ సర్కారుపై ఫైర్ అయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం కష్టమని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓల్డ్ రేట్స్ కే లిక్కర్ అమ్ముతామన్నారు. పార్టీలో శ్రామికుడు అని పేరు పెట్టుకుంటే చాలదని, నిజంగా శ్రామికులకు మేలు చేసేలా పాలన ఉండాలని అన్నారు.