Published 26 Jan 2024
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ-జనసేన మధ్య బంధానికి అగాధం ఏర్పడుతున్నదా… తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం పవన్ కు ఆగ్రహం తెప్పిస్తున్నదా.. పొత్తు ధర్మాన్ని విస్మరించడం వల్లే జనసేనానిలో ఓర్పు నశిస్తున్నదా… ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ప్రస్తుతం పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా తమకు తెలియకుండానే TDP అభ్యర్థుల పేర్లు ప్రకటించారంటూ స్వయంగా పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తున్నప్పుడు చూసుకుంటూ ఉండాలిగా అంటూ పవన్ మాట్లాడారు. ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికలతోనే ఆగిపోవడం లేదని, భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తామన్నారు. అటు TDP కౌంటర్ గా అభ్యర్థుల్ని సైతం జనసేన చీఫ్ ప్రకటించారు.
అభ్యర్థుల ప్రకటనతో అగాథం..?
జనసేన(Janasena)కు తెలియకుండానే కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. దీనిపై జనసేన వర్గాల్లో అయోమయం ఏర్పడటంతో పరిస్థితి పవన్ దాకా వెళ్లింది. దీంతో TDPపై విమర్శలు చేస్తూనే కౌంటర్ గా రాజోలు(Rajolu), రాజానగరం(Rajanagaram) అభ్యర్థుల్ని ప్రకటిస్తూ సంచలన ప్రకటన చేశారు జనసేన అధ్యక్షుడు. ఇది రెండు పార్టీల మధ్య అగాథానికి కారణంగా నిలుస్తున్నది. చంద్రబాబుపై ఎంత ఒత్తిడి ఉందో తనపైనా అంతే ప్రెజర్ ఉందని ఆయన స్పష్టం చేశారు. సర్దుబాటుకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదని, పొత్తు ధర్మాన్ని సైకిల్ పార్టీ ఉల్లంఘించిందని పవన్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే రెండు సీట్లు ప్రకటించినట్లు ఆయన వివరణ ఇచ్చారు.
CM గురించి లోకేశ్ మాట్లాడినా…
రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తున్నాయని తెలిసినా CM పదవి గురించి ప్రతిసారి లోకేశ్ కామెంట్ చేసినా ఓర్పుతో ఉన్నామని పవన్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను తప్పితే ఎన్ని సీట్లు తీసుకోవాలో మాకు తెలుసంటూ ఘాటుగా బదులిచ్చారు. TDP అభ్యర్థుల ప్రకటనతో ఆందోళన పడ్డ జనసేన శ్రేణులకు తాను క్షమాపణ చెబుతున్నట్లు పవన్ తెలిపారు.