జనసేన అధినేత పవన్ కల్యాణ్… వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించిన అనంతరం.. వారాహి యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యాగం పూర్తయిన తర్వాత వారాహికి పూజలు నిర్వహించి అక్కణ్నుంచి కదిలారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 రోజుల పాటు యాత్ర జరగనుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం సహా రాజోలు నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. అన్నవరం నుంచి కత్తిపూడి చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. జనసేనానికి అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. అన్నవరం చేరుకున్న పవన్ కు అభిమానులు నీరాజనం పలికారు. ఈ యాత్రకు జనసైనికులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి రెండ్రోజులకో భారీ బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక తయారైంది. 16న పిఠాపురంలో, 18న కాకినాడలో, 20న ముమ్మిడివరంలో ఇలా… 23న నరసాపురం వరకు తూ.గో జిల్లాలో యాత్ర కొనసాగుతుంది.