వారాహి మూడో విడత విజయ యాత్ర ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు జరిగే ఈ టూర్ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. సాయంత్రం జగదాంబ జక్షన్ లో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అటు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకోవడం.. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా జనంతో మమేకమయ్యేందుకు ప్రణాళిక తయారు చేశారు. యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను జనసేన ఏర్పాటు చేసింది. పవన్ ను చూసేందుకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వారాహి యాత్ర-2 ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు జనసేనకు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. ఇది కాస్తా సినిమాల వరకు వెళ్లింది.
విశాఖను రాజధానికి ఒప్పుకోని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఎలా వస్తారంటూ YCP ప్రశ్నల వర్షం కురిపించింది. వెనుకబడ్డ ఉత్తరాంధ్రను డెవలప్ చేసేందుకు క్యాపిటల్(Capital)గా ప్రకటిస్తే చంద్రబాబుకు అండగా ఉంటూ పవన్ కల్యాణ్ దాన్ని అడ్డుకుంటున్నారని ఇప్పటికే AP మంత్రులు విమర్శించారు. మరోవైపు ఈ వివాదం పవన్ సినిమా ‘బ్రో’ మూవీకి పాకింది. అప్పటికే పవన్ పై గుర్రుగా ఉన్న మంత్రులు.. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్రతో అంబటి రాంబాబును దారుణంగా కించపరిచారంటూ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా యాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తకరంగా తయారైంది.