Published 27 Nov 2023
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి(Sri Venkateshwara Swamy) వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ EO ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. మహాద్వారం వద్ద ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఇఫ్తికఫాల్ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ నాలుగోసారి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాని రాక దృష్ట్యా తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తుతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రధానికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసిన అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
తిరుమల నుంచి తిరిగి తెలంగాణకు
తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్రధాని నిన్న రాత్రికి తిరుపతి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో నాలుగు సభల్లో మోదీ పాల్గొన్నారు. ఈ నెల 25న తెలంగాణకు చేరుకున్న మోదీ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజిబిజీగా గడిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి తెలంగాణకు రానున్న ప్రధాని.. మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. హకీంపేట నుంచి హెలికాప్టర్ లో మహబూబాబాద్ చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. RTC క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ప్రధాని రోడ్ షో సాగనుంది.