నాయకులపై విపరీతమైన అభిమానం వెర్రి వింతలకు కారణమవుతున్నది. ఇదీ అదీ అని తేడా లేకుండా సోషల్ మీడియాలో చివరకు న్యాయవ్యవస్థ కూడా చిక్కుకుంటోంది. తీర్పులు, ఆదేశాలు ఇచ్చిన జడ్జిలపైనే పోస్టులు పెడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటీగా సాగుతున్న పాలిటిక్స్.. ఎప్పుడో వికృతరూపం దాల్చాయి. ఇప్పటివరకు పార్టీలు, లీడర్లకే పరిమితమైన ఆరోపణలు.. ఇప్పుడు న్యాయవ్యవస్థపై పడ్డాయి. నైపుణ్యాభివృద్ధి(Skill Development) కేసులో మాజీ CM చంద్రబాబుకు రిమాండ్ విధించిన మహిళా న్యాయమూర్తిపై.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జ్యుడీషియరీ వ్యవస్థనే కించపరుస్తున్నారు కొందరు. AP CID వేసిన కేసుతో ACB కోర్టు.. చంద్రబాబుకు ఈ నెల 22 వరకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అటు కోర్టులో కేసులు, ఇటు పార్టీల పరస్పర ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ గరం గరంగా మారిపోయింది.
ఇవన్నీ అలా ఉంచితే ఏకంగా మహిళా జడ్జి మీద ఆరోపణలు చేయడంపై అక్కడి లాయర్లు ఆగ్రహంగా ఉన్నారు. పోస్టులు, ఇంటర్వ్యూలపై అభ్యంతరం తెలుపుతూ వాటికి బ్రేక్ వేసేందుకు రెడీ అయ్యారు. క్రిమినల్ కంటెంప్ట్ దాఖలు చేసేందుకు సిద్ధమై.. ఎలా ముందుకెళ్లాలనే దాని మీద అడ్వొకేట్ జనరల్(AG) సలహా తీసుకుంటున్నారు. ఆదేశాలు ఇచ్చిన జడ్జిని లక్ష్యంగా చేసుకోవడం న్యాయవ్యవస్థను(Judiciary Department) కించపరచడమేనని లాయర్లు అంటున్నారు. ఇప్పటికే సదరు మహిళా జడ్జి.. APకి చెందిన మంత్రి సమీప బంధువు అని ప్రచారం జరిగింది. దీనిపై ఆ మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ఇలా వికృత చేష్టలతో పోస్టులు పెడుతూ న్యాయ వ్యవస్థను సైతం సరిగా పనిచేయకుండా చేస్తున్నట్లు అర్థమవుతున్నది. పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. పోస్టులు పెట్టేవారిని, వాటికి వంత పాడుతున్నవారిని లోపలేస్తే గానీ తిక్క కుదరదన్న మాటలు వినపడుతున్నాయి.