తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసేందుకు AP పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు బస చేసిన నంద్యాలకు శనివారం తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అర్థరాత్రి 3 గంటలకు ఆర్.కె.ఫంక్షన్ హాలు వద్దకు చేరుకున్న పోలీసులకు, TDP కార్యకర్తలకు గంట పాటు వాగ్వాదం నడిచింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనంతపురం నుంచి నంద్యాలకు పోలీసు అధికారులు చేరుకున్నారు. నంద్యాల SP ఆఫీసు వద్దకు DIG రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 6 బస్సుల్లో పోలీసులు వెళ్లారు. అయితే బాబును కలిసేందుకు NSG(National Security Guards) కమెండోలు అనుమతినివ్వలేదు. పొద్దున 5:30 తర్వాతే ఆయన్ను కలవనిస్తామని, ఆలోపు వైద్య పరీక్షలు నిర్వహించి తమ ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. అక్కణ్నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే బాబును కలవడానికి అనుమతిస్తామని చెప్పడంతో అటు పోలీసులు, ఇటు NSG, మరోవైపు TDP.. ఇలా మూడు వర్గాల మధ్య గందరగోళం ఏర్పడింది. బాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(CSO), NSG అధికారులతో పోలీసులు మాట్లాడారు. బాబు నిద్రిస్తున్న బస్ డోర్ కొట్టేందుకు యత్నించారు.
పొద్దున 4 గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి TDP కార్యకర్తల్ని పంపించివేశారు. 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థ సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో చంద్రబాబుపై ఉన్నాయి. సబ్ కాంట్రాక్టుల ముడుపులతోపాటు 2020-21కు సంబంధించి రూ.118 కోట్ల లెక్కలు చెప్పలేదంటూ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ 153C సెక్షన్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కన్స్ స్ట్రక్షన్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై నాలుగేళ్లుగా కేంద్ర ఆదాయపన్ను శాఖ విచారణ చేస్తున్నది. ఈ రెండు స్కామ్ ల్లో చేతులు మారింది.. అందులో ఉన్నది ఒక్కరేనని AP CID అనుమానిస్తున్నది.