Published 29 Jan 2024
సార్వత్రిక ఎన్నికల సమరం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. మరో మూడు నెలల్లో జరగనున్న ఓట్ల సంగ్రామం(Elections) కోసం పార్టీలు కసరత్తును వేగవంతం చేశాయి. పొత్తులు, ఎత్తులన్న చందంగా వ్యూహాలకు పదును పెడుతూ ప్రజల్లోకి వెళ్తూనే… వాడీవేడి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో రాజకీయ పార్టీల మధ్య బహిరంగ, రహస్య అవగాహనలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. రెండో టర్మ్ లో YSRCP 151 సీట్లతో అప్రతిహత విజయాన్ని కైవసం చేసుకుంది. ఈసారి 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ నియోజకవర్గాలు గెలుచుకునేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇందుకోసం ఒక్కో పార్టీ ఒక్కో రకమైన విధానాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ “సిద్ధం” పేరుతో సభలు నిర్వహిస్తోంది జగన్ సర్కారు. అటు TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే పాదయాత్ర నిర్వహించారు. ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం బహిరంగ సభల్లో పాల్గొంటూ జనాలకు చేరువవ్వాలని చూస్తున్నారు.
వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్… తాజాగా బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. TDPతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నా.. ఈ మధ్యే ఈ రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. ఎవరికి వారు అభ్యర్థుల్ని ప్రకటించుకోవడంతో ఇరుపార్టీల మధ్య గందరగోళం ఏర్పడింది. CM పదవిపై లోకేశ్ చేసిన కామెంట్స్, అటు అభ్యర్థుల ప్రకటన దృష్ట్యా పవన్ ఘాటుగానే కౌంటరిచ్చారు. ఈ రెండింటితో పాత మిత్రపక్షమైన BJP కలిసి వస్తుందా అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే TDP తమను వాడుకుని వదిలేసే విధంగా వ్యవహరిస్తోందంటూ జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి.
YCP, TDP, జనసేన మధ్య పోటీ తీవ్రమైన పరిస్థితుల్లో AP రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ప్రాణం పోసుకున్నట్లే కనపడుతోంది. YSRTPని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల… APCC అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వరుస సభలు నిర్వహిస్తూ జగనే లక్ష్యంగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. రాజకీయ విమర్శలతోపాటు, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నారు. జగన్ ఓటు బ్యాంకును చీల్చడం కోసం షర్మిలను TDP… ఎన్నికల బరిలోకి దింపుతోందన్న ప్రచారమూ జరుగుతోంది. జగన్ జైలులో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రను కొనసాగించి జగనన్న వదిలిన బాణాన్ని అంటూ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆమే ఇప్పుడు సొంత అన్నపై విమర్శలు AP రాజకీయాల్ని ఇంట్రెస్టింగ్ మార్చింది. షర్మిల ఎంట్రీ…. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అవుతుందన్న రాజకీయ పెద్దయెత్తున నడుస్తున్నాయి.
YCP, TDP, జనసేన, కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడల్ని నిశితంగా గమనిస్తున్న కమలం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎవరు గెలిచినా తమకు కేంద్రంలో ఎవరు మద్దతిస్తారనేదే ఆ పార్టీకి ప్రధాన అంశం. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీలన్నీ హోరాహోరీగా జనాల్లోకి వెళ్లేందుకు పరస్పర విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టించాయి. తమదే అధికారమని ఎవరికి వారు చెప్పుకుంటున్నా.. ఇప్పటివరకైతే ఓటరు నాడి అంతబట్టని విధంగా ఉందన్నది కాదనలేని నిజం.