రైలు నడపాల్సిన డ్రైవర్లు(లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్)లు ఏంచక్కా ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేశారు. క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైలును అతి స్పీడ్ తో ముందుకుపోనిస్తూ తాము ఏం చేస్తున్నామో మరచిపోయారు. ఆ మైకంలోనే ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టి వారు చనిపోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేశారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ చేపట్టిన దర్యాప్తు(Investigation)లో సంచలన విషయాలు బయట పడ్డాయి. ఈ వివరాల్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు.
జరిగిన ఘటన ఇది…
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో 2023 అక్టోబరు 29న జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం-రాయగఢ ప్యాసింజర్ రైలు.. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ ను కంతకపల్లె-అలమంద ప్రాంతంలో ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయగఢ ట్రెయిన్ లోకోపైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తోపాటు పలాస ట్రెయిన్ గార్డు సైతం ప్రాణాలు కోల్పోతే 50 మంది గాయపడ్డారు. ఫోన్ లో క్రికెట్ చూస్తూ రైలు నడిపినట్లు అధికారులు గుర్తించగా పలాస ప్యాసింజర్ ను ఢీకొట్టే ముందు సడెన్ బ్రేకులు వేసినట్లు తేలింది. అప్పుడా టైమ్ లో సదరు ట్రెయిన్ గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోయింది.
మానవ తప్పిదం వల్లే…
రెండు రైళ్లు ఢీకొనడానికి గల ఇతర కారణాలేవీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడలేదు. ఇది కేవలం మానవతప్పిదం(Humar Error) వల్లే జరిగిందని నిర్ధారించుకున్నారు అధికారులు. రాయగఢ ట్రెయిన్ డ్రైవర్లు అప్పటికే రెండు ఆటోమేటిక్ సిగ్నళ్లను దాటడమే కాకుండా నిబంధనల్ని పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణంగా నిలిచిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇక టెక్నాలజీతో…
గతేడాది జరిగిన అతి పెద్ద ఘటనల్లో విజయనగరం ఇన్సిడెంట్ మూడోది. ఒడిషాలోని బాలాసోర్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఒడిషా-బాలాసోర్ ట్రెయిన్ ఢీకొని జూన్ 2న 296 మంది మృతి చెందడమే కాకుండా 1,200 మంది గాయాల పాలయ్యారు. 2023 అక్టోబరు 11న బిహార్ లోని బక్సర్ వద్ద ఢిల్లీ-కామాఖ్య రైలు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారు. ఇక నుంచి క్యాబిన్ లో ఉండే డ్రైవర్లపై పూర్తి నిఘా పెడతామని, ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీ తెస్తున్నామన్నారు రైల్వే మంత్రి.