
విశాఖ సింహాచలం అప్పన్న క్షేత్రంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఆషాఢ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి పౌర్ణమి సమయంలో ముగింపు చేయడం ఆనవాయితీ. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
32 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణ ముగిసేందుకు ఆరు గంటలు పడుతుంది. నిండు చందమామను పోలిన రీతిలో స్వామి స్వరూపాన్ని దర్శించి తరించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. అక్కడి ఏర్పాట్ల తీరును పరిశీలించిన ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.