
చంద్రయాన్-3 ఉపగ్రహం మరో 6 రోజుల్లో చంద్రుని కక్ష్యలోకి ఎంటర్ కానుంది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ మిషన్ విజయవంతంగా సాగుతోందని ఇస్రో(ISRO) తెలిపింది. మన దేశ మూడో లూనార్ మిషన్ అయిన చంద్రయాన్-3.. కక్ష్యలోకి చేరుకునేందుకు మరో 6 రోజుల టైమ్ తీసుకోనుంది. అంతరిక్ష నౌక(ట్రాన్స్ లూనార్ ఇంజక్షన్-TLI)ను చంద్రుని వైపు మళ్లించేందుకు రేపు తెల్లవారుజాము(ఆగస్టు 1)న 12 నుంచి 1 గంటల మధ్య స్లింగ్ షాట్(స్పేస్ క్రాఫ్ట్ ను మండించడం) చేయనుంది. ఈ ప్రక్రియకు అర్థరాత్రి సమయంలో 28 నుంచి 31 నిమిషాలు పట్టనుంది.
ప్రస్తుతం చంద్రయాన్-3 అంతరిక్ష నౌక భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో సెకనుకి కిలోమీటరు నుంచి 10.3 కిలోమీటర్ల మధ్య స్పీడ్ తో వెళ్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి దగ్గరగా(పెరిజి) ఉన్నప్పుడు తక్కువ స్పీడ్ తో, దూరంగా(అపోజీ) ఉన్న సమయంలో వేగంగా తిరుగుతుంటుందని తెలిపారు. స్లింగ్ షాట్ కు యత్నిస్తున్నప్పుడు వ్యోమ నౌక పూర్తి వేగాన్ని కలిగి ఉండాలని, ఆ స్పీడ్ తోనే దాన్ని చంద్రుని వైపు మళ్లించాల్సి ఉంటుందని వివరించారు.