Published 12 Nov 2023
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమాలు చేసీ చేసి అలసిపోయిన అక్కడి ప్రజలకు తెలంగాణకు చెందిన మంత్రి అండగా నిలిచారు. APకి ప్రత్యేక హోదా(Special Status) ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని, APని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రస్తావించిందన్నారు. ప్రధానమంత్రి హోదాలో స్వయంగా మన్మోహన్ సింగే హామీ ఇవ్వడంతో ఆ మాటను నిలుపుకోవాల్సి ఉందని గుర్తు చేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం బాధాకరమంటూ అప్పటి తమ ప్రభుత్వాన్నే తప్పుబట్టారు కోమటిరెడ్డి. ఇప్పుడాయన BJP ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తమ సర్కారు ఇచ్చిన హామీని తామే నెరవేర్చకపోవడంపై ఆయన మాట్లాడటం సంచలనంగా మారింది. భువనగిరి MPగా ఉన్న వెంకటరెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి గెలుపొందారు. అనంతరం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో సినిమాటోగ్రఫీ, R&B శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. MPగా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన AP స్పేషల్ స్టేటస్ పై మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.