కలియుగ దైవంగా భావించే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి(Tirumala Sri Venkateshwara Swamy) వారిని దర్శించుకుని తరించడమే కాదు.. ఆ స్వామి వారికి ముడుపులు చెల్లించుకోవడం కూడా అపార భక్తితత్పతకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. అందుకే శ్రీవారికి నిత్యం హుండీ ఆదాయం కోట్లల్లో వస్తుంటుంది. సాధారణ రోజుల్లో నిత్యం 50 నుంచి 60 వేల మంది దాకా భక్తులు దర్శనాలు చేసుకుంటే వీకెండ్ లో మాత్రం ఆ సంఖ్య 70 నుంచి 90 వేల దాకా ఉంటుంది. దీంతో కేవలం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల దాకా హుండీ ఆదాయమే సమకూరుతుంది.
నెల నెలా రూ.100 కోట్లకు పైగా
యావరేజ్ గా లెక్కిస్తే నెలకు రూ.100 కోట్ల ఆదాయం స్వామి వారికి చేరుతుంటుంది. గత 20 నెలల ఆదాయాన్ని పరిశీలిస్తే నెలకు రూ.100 కోట్లతో మొత్తంగా రూ.2,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వర్గాలు అంటున్నాయి. హుండీ ఆదాయమే ఇలా ఉంటే ఇక ఇతర కానుకల రూపేణా స్వామి వారి పరకామణికి పెద్దయెత్తున నిధులు చేరుతుంటాయి.