
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. శాశ్వతమైనవి కాకుండా తాత్కాలిక రెయిలింగ్స్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చిన్న తిరుపతిగా భావించే ఈ ఆలయాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండా 12 ఎకరాల్లో గుడిని నిర్మించారు. ప్రతి శనివారం నాడు భారీగా భక్తులు వస్తుండగా, కార్తిక ఏకాదశి వేళ వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో రెయిలింగ్ కూలి పరిస్థితి అదుపుతప్పింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండగా, గాయపడ్డవారికి వైద్యమందిస్తున్నారు. అందులో కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారు.