
ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి వైపు పయనిస్తోంది. రెండోసారి కక్ష్య మార్పిడి కోసం సోమవారం నాడు పేలోడ్ ను మండించే ప్రక్రియను ఇస్రో చేపట్టింది. మరోసారి కక్ష్య మార్పిడి ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం ఉంటుందని తెలిపింది. చంద్రయాన్-3 గమనం సజావుగా సాగుతోందని, గంటకు 6,000 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తోందని వివరించింది. ఈ జులై 14న తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఆకాశంలోకి దూసుకెళ్లిన తర్వాత 16 నిమిషాలకు రాకెట్ నుంచి ప్రొపల్షన్ మాడ్యుల్ విడిపోయింది. ఈ ప్రొపల్షన్ మాడ్యుల్ భూమి చుట్టూ 24 రోజుల పాటు చుట్టివస్తుంది.
ఇంచుమించు 3,84,000 కిలోమీటర్లు ప్రయాణించే చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం మొత్తం రూ.613 కోట్లను ఇస్రో వెచ్చించింది. ఆగస్టు 23న సాయంత్రం ఈ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.