అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా సాగనున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి వివిధ సేవలు నిర్వహించనుండగా… తిరుమల మాఢ వీధులు గోవింద నామస్మరణతో మారుమోగనున్నాయి. లోకకల్యాణార్థం ఆ దేవదేవుడే భక్తుల చెంతకు వచ్చి కరుణించే అపురూప ఘట్టానికి బ్రహ్మోత్సవాలు వేదిక కాగా.. శ్రీనివాసుడిని దర్శించుకుని తరించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఈ రోజు ప్రారంభమయ్యే వేడుకలు ఈ నెల 26 వరకు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మీనలగ్న సుముహూర్తాన సాయంత్రం 6:15 గంటలకు ధ్వజారోహణంతో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.
రాత్రి 8 గంటలకు శ్రీవారికి పెదశేష వాహన సేవ నిర్వహించనుండగా.. ఆ సమయంలోనే స్వామి వారికి CM జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తొమ్మిది రోజుల పాటు శ్రీవారికి పొద్దున, సాయంత్రం సమయాల్లో వాహన సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు VIP, స్పెషల్, సిఫారసు లెటర్లతో కూడిన దర్శనాలు రద్దు చేసింది.