అసలు మూగజీవాలు కారడవిని విడిచి జనాల్లోకి ఎందుకొస్తున్నాయి… భక్తులపై దాడి చేయడానికి ప్రధాన కారణమేంటి… క్రూరమృగాల కదలికలు పెద్దయెత్తున కనపడటానికి కారణం ఏంటంటే… అడవిలో వాటికి తగిన రీతిలో సౌకర్యాలు లేకపోవడమేనట. ఇప్పటివరకు తిరుమలలో చిరుతల దాడులే చూశాం. కానీ ఎలుగుబంట్లు కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు వాటిని చూసిన భక్తులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఆరేళ్ల పాపను చిరుత పొట్టన పెట్టుకోగా.. దాన్ని గత అర్థరాత్రి బంధించారు. కానీ అదే నడక మార్గంలో మరో 5 చిరుతలు తిరుగుతున్నాయని గుర్తించారు. ఇవాళ పొద్దున కొంతమంది పిల్లలు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద మరో చిరుతను చూశారు. తొలుత మూడు చిరుతలు ఉన్నాయని భావించినా చివరకు అక్కడ 5 వరకు తిరుగుతున్నట్లు గుర్తించారు. పొద్దున చిరుతను చూసిన భక్తులు పరుగులు తీశారు. ఈ చిరుతల పరిస్థితే ఇలా ఉంటే శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంట్లు తిరుగుతున్నట్లు తేలింది. దీంతో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది.
వాటికి సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్లే తిరుమల నడక దారిలోకి మూగజీవాలు వస్తున్నాయని గుర్తించారు. దీనిపై ఇప్పటికే వైల్డ్ లైఫ్ అధికారులు ఇందుకోసం మీటింగ్ నిర్వహించారు. అలిపిరి నుంచి తిరుమల వరకు మొత్తం TTD పరిధిలో 8,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. PCCF ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ మీటింగ్ జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా 700 కెమెరాలు పెట్టాలని చూస్తున్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్న అధికారులు… ఆకేషియా చెట్లు ఎక్కువగా ఉన్నందున గడ్డి లేకపోవడం వల్ల జంతువులు జనాల్లోకి వస్తున్నాయని గుర్తించారు. అందుకే అటవీ ప్రాంతంలో గడ్డి పెంచేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు ఆహారం, నీటిని అందించాలన్న ఆలోచనతో ఉన్నారు. జనాలు విచ్చలవిడిగా పడేసే పదార్థాలను తినేందుకు జింకలు వస్తున్నాయట. వాటిని వేటాడేందుకు క్రూరమృగాలు వస్తున్నట్లు గుర్తించారు.
భక్తుల కోసం ఎలివేటర్లు, ఫ్లైఓవర్లు నిర్మించుకోవాలని ఫారెస్ట్ అధికారులు ఆలోచనతో ఉన్నట్లు కనపడుతోంది. జంతువులు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతంలో వాటిని అడ్డుకునే చర్యలకు బదులు ఎలివేటర్లు నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అవుతున్నది. మరి ఫారెస్టు మీటింగ్ కు తోడు TTD చేపట్టే సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది చూడాలి.