
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనాలు, సేవలకు సంబంధించిన టికెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. అక్టోబరు(October) నెల అంగప్రదక్షిణ టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు(Srivani Trust) దాతలకు దర్శనం, అక్టోబరు రూమ్స్ కోటా వివరాల్ని ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ ద్వారా ప్రకటించనుంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం దర్శన టికెట్ల కోటాను వివరించనుంది. మరోవైపు అక్టోబరు నెలకు సంబంధించి ఉచిత ప్రత్యేక దర్శనాల వివరాలు ప్రకటిస్తున్నది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ వివరాలు వెల్లడస్తామని తితిదే వర్గాలు అంటున్నాయి.
రూ.300 టికెట్లు రేపు
అక్టోబరు నెలలో కేటాయించే రూ.300 దర్శన టికెట్లను TTD రేపు విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి, తలకోనకు సంబంధించి గదుల కోటాను ఎల్లుండి(బుధవారం) విడుదల చేస్తామని తితిదే తెలిపింది.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామి వారిని 87,792 మంది దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చింది. 29,656 మంది తలనీలాలు సమర్పించినట్లు తితిదే వర్గాలు తెలిపాయి.