తిరుమలగిరులపై భక్తుల్ని బెంబేలెత్తిస్తున్న వన్యమృగాలు.. పలువురిపై దాడి చేసి ఆందోళన కలిగిస్తున్నాయి. నడక దారిలో చిరుతపులులు కనపడటం, వాటిని పట్టి బంధించి జూలో వేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తిరుపతి జూపార్క్(Tirupathi Zoo Park)లోనూ పెద్ద విషాదమే చోటుచేసుకుంది. లయన్ ఎన్ క్లోజర్(Lion Enclosure) లోకి వెళ్లిన వ్యక్తి.. సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతణ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
రాజస్థాన్ వ్యక్తిగా గుర్తింపు…
సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని రాజస్థాన్(Rajasthan) రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మద్యం మత్తులోనే ప్రహ్లాద్ గుల్జార్ అనే వ్యక్తి లయన్ ఎన్ క్లోజర్ లోకి దూకినట్లు నిర్ధారించారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర జూపార్క్ లో వన్యమృగాలను ఉంచుతున్నారు. గతేడాది ఆరు చిరుతలు పట్టుబడగా వాటిని సైతం SV జూ పార్క్ కు తరలించారు.
చిన్నారిని పొట్టనబెట్టుకున్న చిరుత…
తిరుమల కాలినడక దారిలో 2023 ఆగస్టు 11న రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో.. లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన కుటుంబం దైవ దర్శనం కోసం రాగా.. ఆ రోజు రాత్రి ఎనిమిదింటికి కాలినడకన ఆ కుటుంబం తిరుమలకు బయల్దేరింది. పాపను చిరుత లాక్కెళ్లడంతో ఆమె తల్లిదండ్రులు సెక్యూరిటీ సిబ్బందికి కంప్లయింట్ ఇచ్చారు. అంతకుముందు అదే ఏడాది జూన్ లోనూ ఓ బాలుణ్ని చిరుత నోటకరుచుకుని వెళ్లింది. అక్కడున్న వారి అరుపులతో చిన్నారిని అడవిలో వదిలిపెట్టింది. ఆ బాలుడికి తీవ్ర గాయాలైనా చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు.