విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన నౌకలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతున్నది. 25 కేజీల బ్యాగులు 1,000 ఉన్నట్లు CBI, కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకోగా.. వాటి విలువ లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దేశంలో జరిగిన డ్రగ్స్ మాఫియాలో ఇది అత్యంత భారీది అని అంటున్నారు.
బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి ‘SEKU-4375380’ కంటైనర్ ‘ఎండిపోయిన ఈస్ట్’ బ్యాగులతో విశాఖ తీరానికి చేరుకుంది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జర్మనీలోని హాంబర్గ్ పోర్ట్ మీదుగా విశాఖ చేరుకున్న కంటైనర్ ను పట్టుకున్నారు. ఇంటర్ పోల్ సమాచారంతో అలర్ట్ అయిన CBI.. పోర్టులో మకాం వేసింది. ఈ జనవరి 14న బ్రెజిల్ నుంచి బయల్దేరి రెణ్నెల్ల తర్వాత మార్చి 16న విశాఖకు చేరుకుందీ నౌక.
ఈ నెల 19న 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మార్ఫిన్, కొకైన్, నల్లమందు, యాంఫటేమిన్, హెరాయిన్, మెస్కలిన్ వంటి నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు తేలడంతో ప్రకాశం జిల్లా ఈదుమూరికి చెందిన సంధ్య ఆక్వా సంస్థలో సోదాలు చేశారు. రొయ్యల ఆహార దిగుమతులు చేసుకున్నామంటూ పొంతనలేని సమాధానాలిచ్చిందా సంస్థ. దీంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న ఆక్వా పరిశ్రమలోనూ తనిఖీలు జరిగాయి.
కంటైనర్ తెరవకుండా AP అధికారులు, పోర్టు ఉద్యోగులు CBIని అడ్డుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. నమూనాలు సేకరించే పనిలోనూ ఆటంకాలేనంటూ ప్రచారం జరగడంతో విశాఖ CP రవిశంకర్ అయన్నార్ స్పందించారు. ప్రభుత్వ అధికారులు CBIని అడ్డుకున్నారన్న ప్రచారం సరికాదని గుర్తు చేశారు. టెక్నికల్ టర్మ్స్ కోసమే సీబీఐ అలా రాసుకుంది కానీ, ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు.
ప్రస్తుతం తామంతా ఎన్నికల సంఘం(Election Commission) ఆధ్వర్యంలో ఉన్నామని, రాజకీయ ప్రమేయాని(Political Interference)కి అవకాశమే లేదని తెలిపారు. సోదాలకు వచ్చిన కస్టమ్స్ SP తనకు కాల్ చేశారని, డాగ్ స్క్వాడ్ గురించి అడిగారని అయ్యన్నార్ వివరించారు. ప్రైవేటు పోర్ట్ అయినందున అది తమ పరిధి కాదని, కస్టమ్స్ అధికారులు కాల్ చేసి కోరితేనే డాగ్ స్క్వాడ్ ను పంపించామన్నారు.