డిజిటల్ లావాదేవీల్లో 2022 సంవత్సరానికి గాను మన దేశం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ “మైగవ్ ఇండియా’ శనివారం డేటా విడుదల చేసింది. అత్యధిక డిజిటల్ చెల్లింపుల విషయంలో గతేడాది భారత్… 8,950 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్త లావాదేవీలను పరిశీలిస్తే మన వాటా 46 శాతంగా ఉంది. మన తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. 2,920 కోట్ల చెల్లింపులతో ఆ దేశం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా… 1,760 కోట్లతో చైనా, 1,650 కోట్లతో థాయిలాండ్, 800 కోట్ల చెల్లింపులతో దక్షిణకొరియా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ నాలుగు దేశాలు జరిపిన లావాదేవీలన్నీ కలిపినా భారత్ చెల్లింపులను దాటకపోవడం విశేషం. ఈ లెక్కన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మన దేశం ప్రపంచంలోనే అగ్రభాగాన కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
100 రెట్లకు పైగా వృద్ధి
2013-14 ఆర్థిక సంవత్సరంలో 127 కోట్ల డిజిటల్ చెల్లింపులు నమోదైతే… 2022 ఏప్రిల్-2023 మార్చిలో 12,735 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ఏప్రిల్లో 14.07 లక్షల కోట్ల లావాదేవీలు జరగ్గా, మేలో 14.30 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదైనట్లు “మైగవ్ ఇండియా’ వెల్లడించింది. “డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నం.1గా ఉంది. మొబైల్ డేటా సేవలు అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ పరిణామంతో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని’ గతంలోనే ప్రధాని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెలువడిన గణాంకాలు ప్రధాని మాటల్ని నిజం చేస్తున్నాయి.