
గతంలో నోట్ల రద్దు సమయంలో హడావుడి, గొడవలు, ఇబ్బందులూ కనిపించాయి. కానీ ఇప్పుడు 2,000 నోట్లు రద్దు చేసి నెలన్నర గడుస్తున్నా ఎక్కడా హడావుడి లేదు. అసలు నోట్లు తిరిగి వస్తున్నాయా, లేదా అన్నట్లుంది పరిస్థితి. కానీ గత నెలన్నర సమయంలోనే పెద్దయెత్తున నోట్లు బ్యాంకులకు చేరాయని RBI ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత బ్యాంకులకు 76 శాతం 2,000 నోట్లు తిరిగివచ్చాయని రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. ఇందులో ఎక్కువగా డిపాజిట్ల రూపంలోనే తిరిగొచ్చాయని తెలిపింది.
గత మే 19న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి జూన్ 30 వరకు 2.72 లక్షల కోట్లు రిటర్న్ అయ్యాయని చెప్పింది. ఈ సెప్టెంబరు చివరి వరకు నోట్ల మార్పిడికి గడువు ఉన్నా… ఇప్పటికే పెద్ద సంఖ్యలో నగదు తిరిగివచ్చింది. ఈ 2.72 లక్షల కోట్లలో 87 శాతం నోట్లు బ్యాంకుల ద్వారా రాగా, మిగతా 13 శాతం మాత్రమే ఇతర ట్రాన్జాక్షన్స్ ద్వారా RBIకి చేరాయి. కేవలం జూన్ 30న స్టాక్ మార్కెట్ల వేళలు ముగిసే సమయానికి ఆ ఒక్కరోజు నాడు 84,000 కోట్ల విలువైన 2,000 నోట్లు తిరిగివచ్చాయని తెలిపింది.