
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే 12 నుంచి 14 గంటలు పడుతుంది. బస్సుల్లో ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. మామూలు రైళ్లలో వెళ్దామంటే సీట్లే దొరకవు. అలాంటి బాధలకు చెక్ పెట్టేందుకు వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. కాచిగూడ(హైదరాబాద్)-యశ్వంత్ పూర్(బెంగళూరు) ట్రెయిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనితోపాటు మొత్తం దేశవ్యాప్తంగా 9 వందేభారత్ లకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ రైళ్ల ద్వారా 1.11 కోట్ల మంది జర్నీ చేశారని ప్రధాని గుర్తు చేశారు. దేశీయంగా తయారైన వందేభారత్ జర్నీకి ప్యాసింజర్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. అన్ని ట్రిప్పుల్లో సీట్లు ఫుల్ అవుతూ భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. క్రమక్రమంగా వీటి సంఖ్యను పెంచుతూ పోతున్నది కేంద్ర రైల్వే శాఖ.
దేశవ్యాప్తంగా 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో తరచూ కొన్నింటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మహబూబ్ నగర్-కర్నూల్-అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్లే వందేభారత్.. కాచిగూడ నుంచి వెళ్తుంది. ప్రధాని ప్రారంభించిన తొమ్మిది ట్రెయిన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జర్నీని స్టార్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందేభారత్ రైళ్లు నడుస్తూ నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందేభారత్ రైళ్లు నడుస్తూ నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే 3 గంటల ముందుగానే ఇవి గమ్యస్థానాలకు చేరుకుంటాయి. వందేభారత్ రెగ్యులర్ సర్వీసులు 25వ తేదీ నుంచి యశ్వంత్ పూర్, 26న కాచిగూడ నుంచి మొదలవుతాయి. 8 కోచ్ లతో రైలు నడుస్తుండగా.. 7 AC ఛైర్ కార్ కోచ్ లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ ఉంటాయి. 530 సీట్ల కెపాసిటీ గల ఈ ట్రెయిన్స్.. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో నడుస్తుంటాయి.
కాచిగూడలో పొద్దున 5:30కు బయల్దేరే వందేభారత్.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. తిరిగి 2:45 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయల్దేరి రాత్రి 11:15కు కాచిగూడ రీచ్ అవుతుంది. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ వరకు క్యాటరింగ్ ఛార్జి సహా ఏసీ ఛైర్ కార్ ఛార్జీ రూ.1,600 కాగా.. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జి రూ.2,915గా ఉంటుంది. యశ్వంత్ పూర్ నుంచి కాచిగూడకు మాత్రం ఏసీ ఛైర్ కార్ ఛార్జీ రూ.1,540 కాగా.. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జి రూ.2,865గా నిర్ణయించారు. క్యాటరింగ్ ఛార్జీలు వద్దనుకుంటే కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ కు AC ఛైర్ కార్ ధర రూ.1.255 కాగా.. ఎగ్జిక్యూటివ్ రేట్ 2,515గా ఉంది. రిటర్న్ జర్నీకి కూడా ఇదే తరహా ఛార్జీలు ఉన్నాయి.