రాష్ట్రంలో బీర్ల నిల్వలు తగ్గిపోయాయి. మరో వారం రోజులు కూడా మేనేజ్(Manage) చేసే పరిస్థితి లేకపోగా.. కింగ్ ఫిషర్ సంచలన నిర్ణయం తీసుకుంది. బీర్ల సప్లైని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. పాత బకాయిలకు తోడు రేట్లు పెంచకపోవడంతో కింగ్ ఫిషర్ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్.. సరఫరా(Supply) నిలిపివేస్తున్నట్లు ఈనెల(జనవరి) 8న ప్రకటిేంచింది. రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లే 70 శాతానికి పైగా అమ్ముడవుతున్నాయి. బీర్లను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL)కు సరఫరా చేసినందుకు కేస్ కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. కానీ 2019-20 నుంచి ధరలు పెరగకపోవడంతో నష్టాలు భారీగా ఉంటున్నాయని, దీంతో సప్లై ఆపేస్తున్నామని ఇప్పటికే కింగ్ ఫిషర్ తెలిపింది.
అసలే రానున్నది ఎండాకాలం కాబట్టి బీర్లకు డిమాండ్ ఎక్కువ. IML(ఇండియన్ మేడ్ లిక్కర్)తో పోల్చితే సమ్మర్ మొదలయ్యే మార్చి నుంచి మే చివరి వరకు బీర్లదే హవా. తిరిగి జూన్-జులై నుంచి బీర్ల సేల్స్ తగ్గి IML అమ్మకాలు పెరుగుతాయి. ఇలాంటి స్థితిలో నిల్వలపై UB సంస్థ స్పందించి సప్లైని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంస్థ.. ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై TGBCL సానుకూలంగా స్పందించినందున సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.