బీర్ల నిల్వలు తగ్గిపోతుండటంతో రాష్ట్రంలో మద్యం ప్రియులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరో వారం రోజులు ఎలాగోలా మేనేజ్(Manage) చేయొచ్చు కానీ, ఆ తర్వాత బీర్లు దొరకడం కష్టం కానుంది. పాత బకాయిలు ఇవ్వకపోవడం, రేట్లు పెంచకపోవడంతో కింగ్ ఫిషర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ.. సరఫరా(Supply) నిలిపివేసింది. బేసిక్ ధరలు పెంచడం లేదన్నది UB వాదన కాగా.. రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లే 70 శాతానికి పైగా అమ్ముడవుతున్నాయి. సప్లై నిలిపివేస్తున్నట్లు NSE, BSE(బాంబే స్టాక్ ఎక్ఛేంజ్)కు ఇప్పటికే సమాచారమిచ్చింది. ఇలాంటి వాతావరణంలో కొత్త బ్రాండ్లపై సర్కారు దృష్టిపెట్టినా.. రిజిస్టర్ కాని కంపెనీల వల్ల ఇబ్బందులుండే అవకాశాలున్నాయి. బీర్లను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL)కు సరఫరా చేసినందుకు కేస్ కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు.
2019-20 నుంచి ధరలు పెరగకపోవడంతో నష్టాలు భారీగా ఉంటున్నాయని కింగ్ ఫిషర్ అంటోంది. ఈ నిర్ణయంతో 70 శాతానికి పైగా అమ్ముడయ్యే ఆ కంపెనీ స్థానంలో ఎలాంటి బ్రాండ్లు వస్తాయన్నది చూడాల్సి ఉంది. అసలే రానున్నది ఎండాకాలం కాబట్టి బీర్లకు డిమాండ్ ఎక్కువ. IML(ఇండియన్ మేడ్ లిక్కర్)తో పోల్చితే సమ్మర్ మొదలయ్యే మార్చి నుంచి మే చివరి వరకు బీర్లదే హవా. తిరిగి జూన్-జులై నుంచి వాటి సేల్స్ తగ్గి IML అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో బీర్ల అమ్మకాల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆశ్చర్యకరంగా మారింది. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం వచ్చేది మద్యం అమ్మకాల నుంచే.