కారు కొనాలనుకునే వారికి శుభవార్త. కొవిడ్ పేరుతో భారీగా పెరిగిన రేట్లు నాలుగేళ్లకు దిగొచ్చాయి. డిస్కౌంట్స్, వర్షాకాలం, ప్రమోషనల్ ఆఫర్స్ పేరిట ధరలు(Prices) తగ్గుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(FADA) లెక్కల ప్రకారం ఒక్కో కారుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా తగ్గుతున్నది. SUVలకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల దాకా డిస్కౌంట్ ఉంది.
తగ్గింపు ఇలా…
క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ లాయల్టీ, ఎక్ఛేంజ్ పేరిట స్విఫ్ట్(Swift Old)కు రూ.15-20 వేల దాకా.. హోండాసిటీపై రూ.50 వేలు తగ్గుతుంది. సెడాన్, మారుతి సుజుకీ కూడా అదే బాటలో ఉన్నట్లు FADA తెలిపింది. మారుతి ఆల్టో K10(పెట్రోల్) రూ.42 వేలు.. వాగన్ఆర్(WagonR) రూ.25-30 వేల దాకా.. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పై రూ.18-35 వేల దాకా.. హ్యుందాయ్ ఔరా(Aura), సెడాన్ ఫ్రంట్ రూ.23-40 వేల దాకా తగ్గుతున్నాయి.
EVలు, SUVలకు డిస్కౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. హ్యుందాయ్ అల్కజార్(Alcazar) రూ.45-65 వేల దాకా.. మహీంద్రా XUV400 EV రూ.1.5 లక్షల దాకా.. హోండాసిటీ eHEV రూ.65 వేల దాకా తగ్గుతున్నది. వర్షాలతో జూన్-జులైలో కొనుగోళ్లు తగ్గడం, గత మూణ్నెల్లుగా తయారైన వాహనాల అమ్మకాల్లో మందగింపు వంటి కారణాలతో డిస్కౌంట్లు వస్తున్నాయి.
అయితే మహింద్రా థార్, మారుతి సుజుకీ(కొత్త స్విఫ్ట్), ఎర్టిగా వంటివి ఇప్పటికీ ఫుల్ డిమాండ్ తో వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఆల్టో, బొలేరో నియోస్, S-Presso, సెలెరియో, ఇగ్నిస్ వంటి చిన్న కార్లకు డిస్కౌంట్లు ఎక్కువుంటున్నాయి.