విద్యుత్తు(Power) కొనుగోలుకు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మెడకు చుట్టుకుంది. ఛత్తీస్ గఢ్ నుంచి కొనుగోళ్లపై రూ.261 కోట్లు చెల్లించాలంటూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)… నేషనల్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ డబ్బు కట్టేవరకు బిడ్ లో మన డిస్కంలు పాల్గొనకుండా పవర్ ఎక్చేంజీలు అడ్డుకున్నాయి. దీనిపై ప్రభుత్వం.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
జరిగింది ఇది…
కరెంటు కొని సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం PGCILతో కారిడార్ బుక్ చేసుకుంది. అవసరం లేకున్నా కారిడార్లను ముందుగానే బుక్ చేసుకోవడం.. 1,000 మెగావాట్లు సరిపోయినా, అదనంగా మరో 1,000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్స్ బుక్ చేసింది. అయితే కరెంటు లభించే అవకాశం లేదంటూ ఈ కారిడార్ ని రద్దు చేసింది. కానీ వాడినా, వాడకున్నా పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాల్సిందేనంటూ PGCIL… డిస్కంలకు నోటీసుల్ని పంపింది.
ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్(CERC)ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. ఇది CERC పరిధిలో ఉండగానే పవర్ గ్రిడ్ తీసుకున్న నిర్ణయంపై కోర్టుకెక్కాల్సి వచ్చింది.