తలదాచుకునేందుకు సొంత ఇళ్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించేందుకు ఉద్దేశించిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాని(Scheme)కి అడుగు ముందుకు పడింది. ఈ నెల 11న స్కీమ్ ను ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది. ఈ స్కీమ్ కోసం ప్రజాపాలన సదస్సుల్లో 82 లక్షల మంది దరఖాస్తు(Apply) చేసుకున్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం ఇవ్వడంతోపాటు నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లించే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి రుణం పొందేందుకు హౌజింగ్ బోర్డుకు ఆదేశాలిచ్చింది.
పెద్దమొత్తంలో సేకరణ…
ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ స్కీమ్ లో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల నివాసాలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే తొలిదశలో ప్రస్తుతానికి ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు నిధులు అందించేందుకు గాను రూ.3,000 కోట్ల రుణం మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రుణం పొందేందుకు హౌజింగ్ బోర్డుకు అనుమతించింది. మొత్తం 95,235 ఇళ్ల కోసం ఈ మేరకు నిధులు సేకరించాలని హౌజింగ్ బోర్టును ఆదేశించింది.
గ్రామాలు, పట్టణాల వారీగా…
గ్రామాల్లో 57,141 నివాసాలు, పట్టణాల్లో 38,094 ఇళ్ల నిర్మాణాలకు గాను నిధుల కోసం రుణ సమీకరణపై ఈ మేరకు హౌజింగ్ బోర్డుకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 ఇళ్లు లెక్కేసుకున్నా 4,16,500 ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 95,235 ఇళ్లకు గాను రూ.3,000 కోట్లు రుణం తీసుకోనుండగా… మొత్తం నివాసాల్ని లెక్కేసుకుంటే అంతకు నాలుగు రెట్ల నిధులు అవసరమవుతాయి. మరి ఈ నిధుల్ని ప్రభుత్వం ఎలా సేకరిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి ఇచ్చిన మాట ప్రకారం ఈ స్కీమ్ ను ఈ నెల 11న ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.