Published 24 Nov 2023
భారత రక్షణ రంగం మరింత దుర్భేద్యం కాబోతున్నది. మోదీ సర్కారు రక్షణ రంగంపై భారీగా వెచ్చించబోతున్నది. జెట్ ఫైటర్లు, హెలికాప్టర్లు, అధునాతన షిప్ కోసం రూ.1.4 లక్షల కోట్లతో కొత్తగా మరో మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని DAC(Defence Aquisitions Council) నిర్ణయం తీసుకుంది. గగనతల వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న 97 తేజస్ ఫైటర్స్ తోపాటు మరో 156 ప్రచండ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఈనెల 30న జరిగే మీటింగ్ లో ఇందుకు సమ్మతి తెలపనుండగా.. కేబినెట్ కమిటీ అప్రూవల్ తర్వాత టెండర్లు పిలుస్తారు. పొరుగున గల చైనా కవ్వింపులను తట్టుకోవాలంటే వైమానిక రంగాన్ని మరింత పటిష్ఠం చేయాలన్న లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. రానున్న కొన్నేళ్లలో ఈ ఫైటర్ జెట్ లు భారత్ అమ్ములపొదిలో చేరతాయి.
97 తేజస్ మార్క్-1 ఫైటర్స్ విలువ రూ.55 వేల కోట్లు. 2021 ఫిబ్రవరి ఒప్పందం ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ఇప్పటికే 83 జెట్ ల తయారీలో ఉంది. ఇప్పుడు మరో 97 ఫైటర్లకు ఆర్డర్స్ ఇవ్వనుండటంతో వాటి సంఖ్య 180కి చేరుకుంటుంది. 180 తేజస్ జెట్స్ కీలకం కాగా మన వద్ద ఇవి కేవలం 31 మాత్రమే ఉన్నాయి. చైనా, పాక్ పై నిఘా పెట్టాలంటే కనీసం 42 జెట్ల చొప్పున అవసరం. HAL తయారు చేస్తున్న మార్క్-1 జెట్లు 2024-2008 కాలంలో అందుబాటులోకి వస్తాయి. ఇక సెకండ్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ IAC-2 కింద 30 విమానాలను మోహరించేందుకు వీలుగా మరో రూ.40 వేల కోట్లతో భారీ నౌకను సిద్ధం చేస్తున్నారు. రూ.44 వేల కోట్లతో తయారైన INS విక్రాంత్ ఇప్పటికే నేవీ విధుల్లో చేరిపోగా.. కొచ్చి షిప్ యార్డులో తయారయ్యే రెండో ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.40 వేల కోట్లను సిద్ధం చేసింది.
65 వేల టన్నుల IAC-2 అందుబాటులోకి వస్తే నావికాదళం బలపేతమవుతుంది. లయనింగ్, షాన్ డాంగ్ ప్రాంతాల్లో ఇప్పటికే రెండింటిని చైనా మోహరించగా.. మరో 80 వేల టన్నుల ఫ్యూజియాన్ ను గతేడాది జూన్ లో రెడీ చేసింది. ఇలాంటివి అమెరికా వద్ద 11 ఉండగా.. మన దేశం సైతం వాటికి దీటుగా నిలవాలన్న లక్ష్యంతో భారీ ఆర్డర్ కు ముందుకు వచ్చింది. ప్రచండ్ హెలికాప్టర్లలో 90 ఆర్మీకి, 66 ఎయిర్ ఫోర్స్ కు వెళ్లనుండగా.. సియాచిన్ గ్లేసియర్, ఉత్తర లద్దాఖ్ లో వాటిని మోహరిస్తారు.