నచ్చిన వెహికిల్ ను కొనుక్కునే ఆనందం కన్నా దాని నంబర్ వెరైటీగా ఉంటేనే సంబరపడుతున్నారు కొందరు. మరీ ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకునేందుకు వేలం వెర్రిగా పోటీ పడుతున్నారు. అందుకే ఈ ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ప్రతి సంవత్సరం పెద్దయెత్తున రవాణాశాఖకు డబ్బులు వస్తున్నాయి. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ అందరినీ ఆకట్టుకునే ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకున్నారు వాహన యజమానులు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని RTA కార్యాలయంలో వీటిని సొంతం చేసుకునేందుకు లక్షలు గుమ్మరించారు.
ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రవాణా శాఖకు రూ.53.34 లక్షల రెవెన్యూ వచ్చింది. TS 09 GC 9999 నంబరుకు అత్యధికం(Highest)గా 21.60 లక్షల ఆదాయం వెచ్చించి ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. TS 09 GD 0009 నంబరును రూ.10.50 లక్షలకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ సొంతం చేసుకుంది. TS 09 GD 0027కు నంబరుకు అతి తక్కువగా రూ.1.04 లక్షల ఆదాయం వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.