వాహనాల ఫ్యాన్సీ నంబర్ల(Fancy Numbers) కోసం జనం ఎగబడుతున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ TS నుంచి TGగా మారాక వేసిన వేలంలో ఒక్కో ఫ్యాన్సీ నంబరుకు భారీయెత్తున నగదు వచ్చింది. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వేలం ద్వారా రూ.4.29 కోట్లు వసూలైతే అందులో ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే రూ.2.05 కోట్లు వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్…
అన్ని కార్యాలయాల్లో TGతోపాటు 0001 కొత్త సిరీస్ ప్రారంభం కావడంతో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకునేందుకు వాహనాల యజమానులు పోటీపడ్డారు. TG09 0001 నంబరకు అత్యధిక ధర(Highest Rate) పలికింది. ఈ నంబరుకు రూ.9,61,111 వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి పరిధిలో TG07 0999కు రూ.4,75,999 దక్కగా, రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల కోసం భారీగా పోటీ వచ్చిందని తెలియజేశారు. TG09 1111కు రూ.3,73,333, TG07 0369కు రూ.2,90,369 నగదు వచ్చింది.