సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ముందురోజు ప్రవేశపెట్టేదే ఆర్థిక(Economic) సర్వే(Survey). ఇది 1950-51 నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనమిక్ డివిజనే ఈ సర్వేను తయారు చేస్తుంటుంది. 1964 వరకు బడ్జెట్(Budget)తోపాటే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. కానీ ఆ తర్వాత ఈ విధానాన్ని మార్చి బడ్జెట్ కు ఒకరోజు ముందు తెస్తున్నారు.
ఆర్థిక సర్వే అంటే…
ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను చెబుతుంటారు. ఏటా దీని ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగనుండగా, ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన పనులను సర్వేలో తెలియజేస్తారు. పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, విదేశీ మారక నిల్వలు, వ్యవసాయం, ఉద్యోగాలు, ఎగుమతి-దిగుమతులు, నగదు చలామణి, ధరల పెరుగుదల వంటి అంశాల్ని ఈ సర్వే తెలియజేస్తుంటుంది.
బడ్జెట్ అంటే…
ఆయా రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే బడ్జెట్లో పొందుపరుస్తారు. ఇది ఆ సంవత్సరానికి అనుగుణమైందన్నమాట. కానీ ప్రస్తుత పనితీరు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ఆర్థిక సర్వేలో వివరిస్తారు. అంటే గడచిన కాలం, భవిష్యత్తు గురించి సర్వే అంచనా వేస్తుంటుంది.