Published 22 Nov 2023
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ నేత జి.వివేక్ ఇళ్లు, ఆఫీసులపై చేసిన దాడులకు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. రూ.8 కోట్ల లావాదేవీల(Transactions)కు సంబంధించి పోలీసుల కంప్లయింట్ మేరకు దాడులు చేసినట్లు తెలిపింది. విశాక ఇండస్ట్రీస్, MS సెక్యూరిటీ కంపెనీల మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఆ డబ్బు MS సెక్యూరిటీకి సంబంధించింది కాదని క్లారిటీ ఇచ్చింది. బిజినెస్ ద్వారా కేవలం రూ.20 లక్షల మాత్రమే వచ్చిందని.. ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉందన్న ED.. మొత్తంగా రూ.200 కోట్ల మేర ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు గుర్తించామని ప్రకటనలో తెలియజేసింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన జి.వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారం నాడు ఈడీ దాడులు చేసింది. ఏకకాలంలో తొమ్మిది చోట్ల రోజంతా సోదాలు జరిపి పలు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫెమా నిబంధనల ఉల్లంఘన
ఫెమా నిబంధనల్ని MS సెక్యూరిటీ సంస్థ ఉల్లంఘించిందని, ఆయా కంపెనీలను మాజీ MP వివేక్ పరోక్షంగా కంట్రోల్ చేస్తున్నారంటూ ED వివరించింది. ఈ MS సెక్యూరిటీ సంస్థకు మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్ అని.. యశ్వంత్ రియల్టర్స్ లో విదేశీయుల(Foreigners) షేర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి విదేశంలో సంస్థను వివేక్ ఏర్పాటు చేశారని, కంపెనీలే కాకుండా వాటిపై కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నట్లు నిర్ధరణకు వచ్చామని ఈడీ స్పష్టం చేసింది.