
Published 18 Dec 2023
రాష్ట్ర రాబడులపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న సర్కారు.. కింది స్థాయి(Ground Level) పరిస్థితులను చూసి ఆశ్చర్యానికి గురవుతోంది. రాష్ట్ర అప్పులు ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటాయని, మిగతా అప్పులన్నీ కలిపితే అది రూ.5 లక్షల కోట్లు ఉంటుందని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకే స్పష్టం చేయడంతో ఆదాయ మార్గాల్ని ఎలా పెంచాలన్న దానిపైనే దృష్టిసారించింది. దీంతో ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన ఎక్సైజ్ తోపాటు వాణిజ్య పన్నుల(Commercial Taxes) పెంపుపైనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ అప్పులు, ప్రస్తుతం అమలు చేయాల్సిన 6 గ్యారెంటీలు రేవంత్ సర్కారుకు కత్తిమీద సాములా మారాయి. కర్ణాటకలోనూ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు.. తొలిగా కన్నుపెట్టింది అక్కడి ఎక్సైజ్ పాలసీపైనే. అబ్కారీ ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా లిక్కర్ రేట్లు భారీగా పెంచింది. ఇదే తరహాలో తెలంగాణలోనూ రానున్న రోజుల్లో మద్యం రేట్లు పెరుగుతాయా అన్న మాటలు వినిపిస్తున్నాయి.
శాసనసభ సాక్షిగా…
రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులను శాసనసభ సాక్షిగా ప్రజలకు తెలియజెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. KCR సర్కారు చేసిన అప్పులు, వాటిని ఖర్చు చేసిన తీరును వివరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పులు రూ.3.52 లక్షల కోట్లు దాటిన విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల చివరి రెండు రోజుల్లో ప్రస్తావించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లే కనపడుతోంది. తాజా పరిస్థితులను ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని, ఇందుకు అన్ని శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ తోపాటు పలువురు మంత్రులు అన్నారు. ఆరు గ్యారెంటీల్లో బాకీ పడిన నాలుగింటి అమలుకు ముందు.. నేరుగా ప్రజల వద్దకు సమాచారం వెళ్తేనే బాగుంటుందన్న ఉద్దేశం సర్కారులో స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలంటే ఎక్సైజ్ పాలసీని సవరించే అవకాశమూ కనపడుతోంది.
ఎక్సైజ్ పాలసీని సవరిస్తే…
మద్యం పాలసీ, రేట్ల విషయంలో తెలంగాణకు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. అటు ఢిల్లీ, తమిళనాడు కన్నా అత్యధికంగా కర్ణాటకలోనే మద్యం రేట్లు ఉన్నాయి. సిద్ధరామయ్య సర్కారు వచ్చాక అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ(AED) పేరుతో 20 శాతం రేట్లు పెంచుతూ బడ్జెట్ లో పెట్టారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ రకం బ్రాండ్లు సైతం అక్కడ చుక్కలు చూపిస్తున్నాయి. 78 శాతం తక్కువ బ్రాండే తీసుకుంటారని, కేవలం 5 శాతం మాత్రమే టాప్ బ్రాండ్స్ వాడతారని కర్ణాటక ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఇక బీర్ల రేట్లలో మూడో స్థానంలో ఉంది కర్ణాటక. పెంచిన రేట్లతో అక్కడ 650ml బీర్ రూ.187కు చేరుకుంది. ఇది తమిళనాడులో రూ.210 కాగా… దిల్లీలో రూ.190గా ఉంది. కర్ణాటక రేట్ల ఎఫెక్ట్ తెలంగాణపై పడే అవకాశం కనపడుతోంది. లిక్కర్ పాలసీపై ప్రభుత్వం కన్నేస్తే మాత్రం రేట్లు భారీగా పెరిగే అవకాశమైతే కనపడుతున్నట్లు తెలుస్తోంది.