ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడేవాళ్లే కాకుండా సాధారణ వ్యక్తుల్లోనూ గూగుల్ అంటే తెలియని వారుండరేమో. అంతలా దూసుకుపోతున్న ఆ కంపెనీ.. ఇప్పుడు తీవ్రమైన విచారణను ఎదుర్కొనబోతున్నట్లు కనపడుతున్నది. సెర్చ్ మార్కెట్ ను తన గుప్పిట్లో పెట్టుకుందన్న ఆరోపణలపై ప్రముఖ సెర్చింజన్ సంస్థ ‘గూగుల్’.. న్యాయపరమైన చిక్కుల్లో పడ్డట్లే కనిపిస్తున్నది. అన్ని డివైజ్ లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా అవతరించిందని అమెరికా లీగల్ సర్వీసెస్ ఆరోపిస్తున్నది. బహుళజాతి సంస్థ వల్ల కలిగే దుష్ప్రయోజనాలను నిరోధించే చట్టమైన ‘యాంటీ ట్రస్ట్’ కింద మంగళవారం విచారణ చేపట్టింది. అన్ని చోట్లా, అన్ని డివైజ్ లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా గూగుల్ ఉండేలా లాక్ చేసిందంటూ అమెరికన్ ఫెడరన్ లాయర్లు, అటార్నీ జనరల్స్ చర్యలకు దిగుతున్నారు. చట్టాన్ని గూగుల్ ఉల్లంఘించిందని నిరూపణ అయితే ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపైనా మరో విచారణ జరిగే అవకాశముంది. సంస్థ CEO సుందర్ పిచాయ్ ని సైతం విచారణకు పిలిచే అవకాశమున్నట్లు అమెరికన్ లీగల్ సర్వీస్ కు చెందిన అధికారులు అంటున్నారు.
ఐఫోన్ లు, సఫారి, మొబైల్ ఫైర్ ఫాక్స్ వంటి ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్లలో డిఫాల్ట్ గా గూగుల్ ఉండేందుకు గాను ప్రతి సంవత్సరం రూ.83 వేల కోట్లు(10 బిలియన్ డాలర్ల) వరకు ఖర్చు పెట్టిందని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ లోనూ యాప్ స్టోర్ ఫుల్ లెవెల్ యాక్సెస్ పొందాలంటే ఫోన్ తయారీదారులు గూగులే డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉండేలా సంస్థ రూల్ పెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. అటు అమెరికా న్యాయ విభాగం ఆరోపణలను గూగుల్ తోసిపుచ్చింది. 90 శాతం మార్కెట్ పై తమకు పట్టు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్లు వాదించింది. మైక్రోసాఫ్ట్ కు చెందిన బింగ్, అమెజాన్, యెల్ప్ వంటి వెబ్ సైట్ల నుంచి కాంపిటీషన్ ఉన్నట్లు వెల్లడించింది. సెర్చ్ ఇంజిన్ ను ఎప్పటికప్పుడు డెవలప్, అప్డేట్ చేయడం వల్లే కస్టమర్లు తమవైపు చూస్తున్నారని గూగుల్ స్పష్టం చేసింది.