
43 ఎకరాలు వేలం వేస్తే వేల కోట్ల ఆదాయం రావడమా. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది. అలాంటి ల్యాండ్స్ కు హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఖిల్లాగా భావించే కోకాపేట వేదికైంది. అక్కడ భూముల రేట్లు చుక్కలనంటుతున్నాయి అని చెప్పడానికి… సామాన్యుడికే కాదు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా భూమి దక్కే పరిస్థితి లేదనడానికి నిదర్శనమిది. హయ్యెస్ట్ గా ఎకరం ధర రూ.100.75 కోట్లు పలికిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా భావించే కోకాపేటలో ఎకరం ధర రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుంది. ఇక్కడ నియో పొలిస్ ల్యాండ్స్ ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. HMDA-కోకాపేట నియో పొలిస్ ఫేజ్-2లో భారీ డిమాండ్ పలికింది. హైదరాబాద్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో అమ్ముడైంది. వేలం వేసిన భూముల్లో యావరేజ్(Average)గా ఎకరం రేట్ రూ.73.23 కోట్లు పలికింది.
ఎకరానికి రూ.35 కోట్లతో బిడ్డింగ్ ను HMDA స్టార్ట్ చేసింది. ఈ వేలంలో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కాంపిటీషన్ కు వచ్చాయి. ఎకరం ధర అత్యధికంగా రూ.100.75 కోట్లు, అత్యల్పంగా రూ.67.25 కోట్లు పలికింది. ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల ద్వారానే హైదరాబాద్ నగర పాలక సంస్థకు 1,532.50 కోట్ల ఇన్ కం వచ్చింది. తర్వాత 10, 11, 14 నెంబరు ప్లాట్లకు వేలం వేస్తే పదో నంబరు ప్లాట్ హయ్యెస్ట్ గా రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. మై హోం, షాపూర్ జీ పల్లోంజి, NCC వంటి టాప్ కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహించడం ద్వారా HMDAకు 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది.