Published 19 Dec 2023
ఏటికేడు ఐపీఎల్(Indian Premier League) కొనుగోళ్లు చుక్కలనంటుతున్నాయి. ఒక్క సీజన్ కే కోరుకున్న ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయి యాజమాన్యాలు. గత సీజన్ లో రూ.18.5 కోట్లతో సంచలనం సృష్టించింది శామ్ కరణ్ అయితే.. ఇప్పటిదాకా IPL చరిత్రనే తిరగరాశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్. కేవలం గంట వ్యవధిలోనే తన దేశానికే చెందిన ప్యాట్ కమిన్స్ ను దాటి ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. గత 15 IPL సీజన్లలోనే ఎవరికీ చెల్లించని రీతిలో రూ.24.75 కోట్లు పెట్టి స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చేజిక్కించుకుంది. భారీ ధర ఉంటుందనుకున్నారు కానీ ఈ స్థాయిలో పెడతారని ఎవరూ ఊహించలేదు. గంట క్రితం ఆస్ట్రేలియాకే చెందిన ప్యాట్ కమిన్స్ ఏకంగా రూ.20.5 కోట్లకు అమ్ముడయ్యాడు.
వేలం మొదలైన కొద్దిసేపటికి పేస్ బౌలర్, ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ను రికార్డు స్థాయిలో భారీ మొత్తం వెచ్చించి హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుగోలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యంత భారీ మొత్తం అనుకున్నారు. కానీ ఆ రికార్డును కాసేపట్లోనే బద్ధలు కొడుతూ మిచెల్ స్టార్క్ సరికొత్త చరిత్రకు నాంది అయ్యాడు. అటు న్యూజిలాండ్ కు చెందిన డారెల్ మిచెల్ ను రూ.14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుక్కుంది. ఇక భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ సైతం చరిత్ర లిఖించాడు. ఇతణ్ని రూ.11.75 కోట్లు చెల్లించి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
రోహిత్ శర్మ కోసం ఎదురుచూపు
సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ముంబయి ఇండియన్స్ ను నడిపిస్తున్న రోహిత్ శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ మంతనాలు సాగించింది. ఇందుకోసం ముంబయి ఇండియన్స్ యాజమాన్యంతో చర్చలు జరిపింది. కానీ ఆ జట్టు రోహిత్ ను వదులుకోవడానికి ఇష్టపడలేదు. 2013 నుంచి 2023 వరకు మొత్తం 5 సార్లు ముంబయికి టైటిల్స్ అందించాడు రోహిత్. ఈ లీగ్ లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ కు పేరుండగా.. అతడి నాయకత్వంలో 158 మ్యాచ్ లాడితే విన్నింగ్ పర్సంటేజ్ 56.33గా ఉంది. ఈ భారత కెప్టెన్ స్థానంలో హార్దిక్ పాండ్యను నెక్ట్స్ కెప్టెన్ గా ప్రకటిస్తుందనుకున్న అంచనాల దృష్ట్యా గుజరాత్ నుంచి హార్దిక్ ను ముంబయి సొంతం చేసుకుంది. అయినా రోహిత్ ను మాత్రం వదులుకోవడానికి సదరు ఫ్రాంచైజీ ఇష్టపడలేదు.