భారత సంతతికి చెందిన టెక్నాలజీ కంపెనీ బాస్ రోజు వారీ సంపాదన రూ.48 కోట్లు. అత్యధిక వేతనం(Highest Paid) అందుకుంటున్న వ్యక్తుల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిచారు. సంవత్సరానికి రూ.17,500 కోట్లు సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు జగ్ దీప్ సింగ్. ఎలక్ట్రిక్ వాహనాల(EV) కంపెనీ ‘క్వాంటమ్ స్కేప్’కు ఆయన వ్యవస్థాపకుడు. అన్నింటినీ కలిపితే ఏడాదికి ఆయన సంపాదన రూ.19,500 కోట్ల(2.3 బిలియన్ డాలర్లు)కు పైమాటే. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో BTech, కాలిఫోర్నియా వర్సిటీలో MBA పూర్తి చేసిన జగ్ దీప్.. తొలినాళ్లలో HP(Hewlett-Packard), సన్ మైక్రోసిస్టమ్స్ సహా పలు స్టార్టప్ కంపెనీల్లో పనిచేశారు. పదేళ్ల ఉద్యోగ జీవితం తర్వాత 2010లో ‘క్వాంటమ్ స్కేప్’ను ప్రారంభించి బ్యాటరీ టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలు తెచ్చారు. ఈ ప్రయోగాలు ఎలక్ట్రిక్ వాహనాల్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
సంప్రదాయ లిథియం-ఐయాన్ బ్యాటరీల స్థానంలో లిక్విడ్ ఎలక్ట్రోలైట్స్ వాడకుండానే వేగంగా ఛార్జ్ అవుతూ కెపాసిటీ మరింత పెరిగే రీతిలో బ్యాటరీలు ఆ కంపెనీలో తయారయ్యాయి. EV రంగంలో ఈ ఆవిష్కరణలు సంచలనంగా మారగా, బిల్ గేట్స్, వోక్స్ వాగన్ వంటి అధినేతలు ‘క్వాంటమ్ స్కేప్’లో పెట్టుబడులు పెట్టారు. 2024 ఫిబ్రవరి 16న CEOగా వైదొలిగిన జగ్ దీప్.. ఆ స్థానంలో శివ శివరామ్ ను నియమించారు. 2023 సెప్టెంబరులోనే జాయిన అయిన శివరామ్ ను ఏకంగా ప్రెసిడెంట్ చేశారు. అయితే జగ్ దీప్ సింగ్ ఇప్పటికీ ‘క్వాంటమ్ స్కేప్’ బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.